అమ్మాయిలు ఇష్టపడడం లేదు.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది, నాకో అమ్మాయిని చూసి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ

14-09-2021 Tue 08:55
  • చంద్రపూర్ ఎమ్మెల్యేకు లేఖ రాసిన యువకుడు
  • అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు
  • వారిని చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోంది
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ
 In Chandrapur a young man wrote a letter to the MLA asking for girlfriend

అల్లరిచిల్లరగా, జులాయిగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనను మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదంటూ ఓ యువకుడు వాపోయాడు. ఇది తనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, తనకో గాళ్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలంటూ ఓ యువకుడు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు లేఖ రాశాడు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భూషణ్ జామువంత్ అనే యువకుడు మరాఠీలో ఈ లేఖ రాశాడు.

తాను ఉంటున్న ప్రాంతంలో బోల్డంతమంది చక్కని అమ్మాయిలు ఉన్నారని, అయినప్పటికీ తనను ఎవరూ ఇష్టపడడం లేదని భూషణ్ వాపోయాడు. అమ్మాయిలు తనను ఇష్టపడకపోవడంతో తనలో ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. మద్యం తాగేవారికి, అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనకు మాత్రం ఎవరూ లేరని అన్నాడు. వారిని చూస్తున్నప్పుడల్లా తన బాధ మరింత ఎక్కువ అవుతోందన్నాడు. కాబట్టి తనకో గాళ్ ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని వేడుకున్నాడు.

ఈ లేఖపై ఎమ్మెల్యే సుభాష్ స్పందించారు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి లేఖలు రాలేదని పేర్కొన్నారు. భూషణ్ ఎక్కడ ఉంటాడో తనకు తెలియదని, అతడి సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించినట్టు చెప్పారు. అయినా ఇలాంటి ఉత్తరాలు రాయడం సరికాదని, అతడి ఆచూకీ తెలిస్తే పట్టుకుని కౌన్సెలింగ్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.