కూతురు పుట్టిందని ఈ పానీపూరీ బండి ఓనర్ ఏం చేశాడో చూడండి!

13-09-2021 Mon 22:04
  • కుమార్తె కావాలని కలలు కన్న అంజల్ గుప్తా
  • ఆగస్టు 17న కుమార్తె జననం
  • సంతోషంతో ఊరందరికీ ఉచిత పానీపూరీ
  • రూ.50వేలు ఖర్చు చేసి సంతోషం పంచుకున్న వ్యాపారి
panipuri seller celebrates daughter birth

సమాజంలో చాలా మంది ఆడపిల్ల పుడితే ఇబ్బంది పడతారు. అబ్బాయే కావాలంటూ గొడవలు పడేవాళ్లనూ చూశాం. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన అంచల్ గుప్తా అలాంటి వ్యక్తి కాదు. కోలార్ ప్రాంతానికి చెందిన అంచల్.. స్థానికంగా పానీపూరీ అమ్ముతుంటాడు. అతనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం.

తనకు అమ్మాయే కావాలని పెళ్లయిన నాటి నుంచి కలలుకంటూనే ఉన్నాడు. కానీ అతనికి తొలి సంతానంగా రెండేళ్ల క్రితం అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 17న అమ్మాయి పుట్టింది. దీంతో అంచల్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం తన కుమారుడి రెండో పుట్టినరోజున.. తనకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని ప్రకటించాడు.

ఈ శుభసందర్భాన్ని ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్న అంచల్.. స్థానికులందరికీ ఉచితంగా పానీపూరీ పంచిపెట్టాడు. దీనికోసం రూ.50వేలు ఖర్చుపెట్టాడు. ‘‘సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లలు సమానమని, వివక్షకు తావులేదని చెప్పాలనుకున్నా. అందుకే ఇలా కూతురు పుట్టిందనే సంతోషంతో అందరికీ ఉచితంగా పానీపూరీ పంచిపెట్టా’’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అంచల్. ఈ విషయం దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది.  అందరూ అంచల్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.