Ajith: అజిత్, నవదీప్... నెట్టింట వీళ్లదే సందడి!

Ajith and Navdeep at a bike racing event held in Hyderabad
  • ఇటీవల హైదరాబాదులో బైక్ రేసింగ్
  • ఈవెంట్ కు విచ్చేసిన అజిత్
  • నవదీప్ తో ఫొటోలకు పోజులు
  • సోషల్ మీడియాలో షేర్ చేసిన నవదీప్
తమిళ అగ్రహీరో అజిత్ ఎంతో నైపుణ్యం ఉన్న బైక్ రేసర్ అని తెలిసిందే. సినిమా షూటింగ్ విరామాల్లో తన రేసింగ్ ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అజిత్ ఇటీవల హైదరాబాదులో ఓ రేసింగ్ ఈవెంట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా నటుడు నవదీప్ తో కలిసి ఉన్నప్పటి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

అజిత్ నటుడిగా ఎంతో ఉన్నతస్థానానికి ఎదిగినా వ్యక్తిగా ఎప్పుడూ ఒదిగి ఉంటాడు. అజిత్, నవదీప్ కలిసి 2008లో ఏగాన్ అనే సినిమాలో నటించారు. అయితే, హైదరాబాదు వచ్చిన సందర్భంగా అజిత్... ఆనాటి తన సహనటుడు నవదీప్ ను ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆశ్చర్యానికి గురిచేశాడు. 'తాలా' అజిత్ తనను హాయ్ అంటూ పలకరించడంతో నవదీప్ ఆనందం అంతాఇంతా కాదు. రేసింగ్ ఈవెంట్ వద్ద తాము కలుసుకున్న ఫొటోలను నవదీప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నవదీప్ వెల్లడించిన మనోభావాలు అజిత్ గొప్పదనాన్ని చాటుతాయి.

"ఈ వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం. వాస్తవానికి మేం కలిసి ఎన్నో ఏళ్లయినా, ఇప్పుడు ఆయన ఎంతో చనువుగా హాయ్ అని పిలవడం అద్భుతం అనిపించింది. ఆయన నిరాడంబరత, ఆయన ఆలోచనా తీరు గురించి ఎంత చెప్పినా ఆ ఆనందం తనివితీరదు. నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఆయనను అందరూ తాలా అని పిలిచేది అందుకే" అని వివరించారు.

ఇక, బైక్ రేసింగ్ ఈవెంట్ వద్ద తాలా క్రేజ్ అంతాఇంతా కాదు. అజిత్ తో ఫొటోలు దిగడానికి ప్రొఫెషనల్ బైక్ రేసర్లు పోటీలు పడ్డారు. ఎవరినీ నిరుత్సాహపరచకుండా అజిత్ అందరితోనూ ఫొటోలు దిగి సంతోషపెట్టారు. ఈ ఈవెంట్ ను చిత్రీకరించే ఓ డ్రోన్ ను ఆయన స్వయంగా ఆపరేట్ చేశారు.
Ajith
Navdeep
Bike Racing
Hyderabad

More Telugu News