భార్యను వదిలించుకోవడం కోసం హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు!

13-09-2021 Mon 19:50
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • విడాకుల కోసం ఓ ల్యాబ్ టెక్నీషియన్ దారుణం
  • హెచ్ఐవీ రోగికి గుచ్చిన సూదితో భార్యకు ఇంజెక్షన్
  • గర్భవతిగా ఉన్న భార్య
Lab technician give his wife HIV injection

అతడి పేరు మహేశ్ గౌతమ్. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్ గా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నాడు. 2020లో మహేశ్ గౌతమ్ కు పెళ్లయింది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే మరో ఉద్యోగినితో మహేశ్ కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలియడంతో భార్య అతడిని నిలదీసింది.

ప్రియురాలిని వదులుకోవడానికి ఇష్టపడని మహేశ్... వేదమంత్రాల సాక్షిగా పరిణయమాడిన భార్యను వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసేవాడు. అప్పటికి అతడి భార్య గర్భవతి. గర్భిణి అని కూడా చూడకుండా ఆమెకు ఓ హెచ్ఐవీ సూదితో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఓ హెచ్ఐవీ రోగికి చేసిన ఇంజెక్షన్ ను అలాగే తీసుకువచ్చి భార్యకు గుచ్చాడు. ఈ విషయం అతడి భార్య తెలిసింది.

దాంతో ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కుట్రలో మహేశ్, అతని తల్లిదండ్రులతో పాటు ఆసుపత్రి యజమాని కూడా భాగస్వామేనని ఆ అమ్మాయి తండ్రి ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యజమాని వీరికి బంధువు కావడంతో సహకరించాడని తెలిపారు.