ఈటలది మొసలి కన్నీరు: హరీశ్ రావు

13-09-2021 Mon 18:30
  • హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాటలయుద్ధం
  • ఈటల వర్సెస్ హరీశ్ రావు
  • ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడన్న హరీశ్
  • తమది పనిచేసే ప్రభుత్వమని వెల్లడి
Harish Rao criticizes Eatala Rajendar

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి తన్నీరు హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఈటలది మొసలి కన్నీరు అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఈటలకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఒక్క సీఎం పదవి తప్ప అన్ని పదవులు కల్పించిందని వెల్లడించారు. కానీ, ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు.

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులకు ఆర్థిక ఆసరా నిమిత్తం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తమది పనిచేసే ప్రభుత్వం అని, బీజేపీ నేతలవి వట్టి మాటలేనని అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని హరీశ్ విమర్శించారు.

హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా కమలాపూర్ లో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడుపుతూ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.