హరీశ్ రావ్! గుండె మీద చేయి వేసుకుని చెప్పు: ఈటల రాజేందర్

13-09-2021 Mon 18:11
  • నేను సీఎం కావాలనుకున్నానని హరీశ్ అబద్ధాలు చెపుతున్నారు
  • టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్
  • హరీశ్ మాదిరి నేను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదు
Etela Rajender fires on Harish Rao

తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా హరీశ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక రబ్బరు స్టాంప్ వంటివారిని అన్నారు. తాను సీఎం కావాలని అనుకున్నానని హరీశ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయాన్ని హరీశ్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని అన్నారు.

పార్టీకి తాను రాజీనామా చేయలేదని... తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయాలని చెపితేనే చేశానని తెలిపారు. హరీశ్ కు ఆయన మామ కేసీఆర్ ఉన్నారని... ఆయన మాదిరి తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అడుగులకు మడుగులు ఒత్తేవారికే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం రిహార్సల్ మాత్రమేనని చెప్పారు.