కొందరు నన్ను జైలుకి పంపించాలని చూస్తున్నారు: అశోక్ గజపతిరాజు

13-09-2021 Mon 17:19
  • మాన్సాస్ సిబ్బందికి జీతాలు ఇవ్వమని అడిగినందుకు నాపై కేసులు పెట్టారు
  • దేవాదాయ నిధులను వాహనమిత్రకు వాడారు
  • రామతీర్థం ఘటనపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు
Somebody are trying to send me to jail says Ashok Gajapathi Raju

డబ్బు ఉండి కూడా మాన్సాస్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం దారుణమని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. మాన్సాస్ సిబ్బందికి జీతాలు ఇవ్వమని అడిగినందుకు తనపై మాన్సాస్ ఈవో కేసు పెట్టారని మండిపడ్డారు. దీంతో తాను కోర్టుకు వెళ్లానని... ఆ తర్వాత సిబ్బందికి జీతాలు ఇవ్వండని చెప్పారని... అయితే సదరు ఈవోపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు.

అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా చూడాల్సిన అవసరం ఉందని అశోక్ చెప్పారు. వాహనమిత్ర కార్యక్రమానికి కూడా దేవాదాయ నిధులు వాడారని... ఇది చాలా దారుణమని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.

రామతీర్థం ఆలయం ఘటనపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని... ఆ ఘటనను రాజకీయం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. సీసీ కెమెరాలు పెట్టలేదని తనను పదవి నుంచి తొలగించారని... దేవాలయాల డబ్బులు ప్రభుత్వం తీసుకుని... కెమెరాలను తనను పెట్టించమంటే ఎలాగని ప్రశ్నించారు. వైసీపీలోని కొందరు తనను జైలుకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు.