చిన్నారి అత్యాచారం ఘటనపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదు: రేవంత్ రెడ్డి ఆగ్రహం

13-09-2021 Mon 17:03
  • సైదాబాద్ సింగరేణి కాలనీలో ఘటన
  • చిన్నారిపై అత్యాచారం
  • మరణించిన చిన్నారి
  • చిన్నారి కుటుంబ సభ్యులకు రేవంత్ పరామర్శ
Revanth Reddy slams Telangana ministers

ఇటీవల హైదరాబాదులో ఆరేళ్ల చిన్నారి పక్కింట్లో శవమై తేలడం తీవ్ర సంచలనం సృష్టించింది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారణమైన ఘటన సర్వత్రా ఆగ్రహావేశాలకు దారితీసింది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.

చిన్నారి హత్యాచారంపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు మానవత్వం ఏమాత్రం లేదన్న సంగతి దీన్నిబట్టే అర్థమవుతోందని అన్నారు. సింగరేణి కాలనీని దత్తత తీసుకున్న హోంమంత్రి ఇప్పటివరకు ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని, ఉన్నతవర్గాలకు కొమ్ము కాస్తూ, గిరిజనుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేయలేదా? అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కూడా ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటని నిలదీశారు.

నేడు సింగరేణి కాలనీకి విచ్చేసిన రేవంత్ రెడ్డి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత ఆర్థికసాయం అందించి, పార్టీ అండగా వుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారిని ఏమని ఓదార్చాలో మాటలు రావడంలేదని పేర్కొన్నారు.