కల చెదరడంతో... రాకెట్ నేలకేసి కొట్టి... యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓటమితో జకోవిచ్ కన్నీటి పర్యంతం

13-09-2021 Mon 15:25
  • యూఎస్ ఓపెన్ విజేత డానిల్ మెద్వెదెవ్
  • ఫైనల్లో జకోవిచ్ పరాజయం
  • వరుస సెట్లలో గెలిచిన రష్యా ఆటగాడు 
  • రికార్డు ముంగిట జకోవిచ్ కు నిరాశ
Novak Djokovic cries after huge setback in US Open summit clash

మరొక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిస్తే 21 టైటిళ్లతో చరిత్రలో నిలిచిపోతాడనగా, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ కు యూఎస్ ఓపెన్ ఫైనల్లో గర్వభంగం జరిగింది. ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ చేతిలో జకోవిచ్ 4-6, 4-6, 4-6 తేడాతో ఘోర పరాజయం చవిచూశాడు.

ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో నాదల్, ఫెదరర్ ల రికార్డును సమం చేసిన జకోవిచ్ కు ఈ ఓటమి తీవ్ర వేదన మిగిల్చింది. పురుషుల సింగిల్స్ లో రికార్డు నమోదు చేయాలని భావించిన జకోవిచ్ కలలు భగ్నమయ్యాయి. దాంతో ఈ సెర్బియా యోధుడు తీవ్ర అసహనంతో రాకెట్ ను నేలకేసి కొట్టాడు. ఆపై భోరున విలపించాడు.

యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అద్వితీయమైన ఆటతీరుతో జకోవిచ్ పై నెగ్గాడు. ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో చిత్తు చేశాడు.