మజారే షరీఫ్ నగరంలో కిడ్నాపర్ల గ్యాంగు ఆటకట్టించిన తాలిబన్లు

13-09-2021 Mon 14:37
  • బాల్ఖ్ ప్రావిన్స్ లో ఆరుగురు చిన్నారుల కిడ్నాప్
  • కిడ్నాపర్లను అడ్డుకున్న తాలిబన్లు
  • ఇద్దరు చిన్నారులను చంపేసిన కిడ్నాపర్లు
  • ఐదుగురు కిడ్నాపర్లను మట్టుబెట్టిన తాలిబన్లు
Taliban killed five kidnapers

ఆఫ్ఘనిస్థాన్ లో అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. బాల్ఖ్ ప్రావిన్స్ లోని మజారే షరీఫ్ నగరంలో చిన్నారులను కిడ్నాప్ చేసిన ఓ ముఠా అంతు చూశారు. అపహరణకు గురైన ఆరుగురు చిన్నారుల్లో నలుగురిని తాలిబన్లు కాపాడారు. ఇద్దరు చిన్నారులను కిడ్నాపర్లు బలిగొన్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ భీకర పోరులో ఐదుగురు కిడ్నాపర్లను తాలిబన్లు మట్టుబెట్టారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

తాలిబన్ల సమాచార, సాంస్కృతిక విభాగం అధిపతి జబీహుల్లా నౌరాని ఈ మేరకు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ తాలిబన్ యోధుడికి గాయాలయ్యాయని తెలిపారు.