Supreme Court: సుప్రీంకోర్టు హెచ్చరికలతో పరుగులు పెట్టిన కేంద్రం.. 37 ఖాళీల భర్తీ!

  • ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీపై కేంద్రం వైఖరిపై సీజేఐ తీవ్ర అసంతృప్తి
  • సోమవారంలోగా భర్తీ చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
  • ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలిగా నియమితులైన రిటైర్డ్ జస్టిస్ తేలప్రోలు రజని
You are emasculating tribunals by not filling vacancies Supreme Court to Centre

సుప్రీంకోర్టు హెచ్చరికలపై కేంద్రం పరుగులు పెట్టింది. అప్పటికప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో 8 మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యులను నియమించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ)లో ఆరుగురు జ్యుడీషియల్, ఏడుగురు అకౌంటెంట్ సభ్యులను నియమించింది. అలాగే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీషియల్ సభ్యులను నియమించింది. మొత్తంగా ఈ మూడింటిలో కలిపి 37 ఖాళీలను ఆగమేఘాల మీద భర్తీచేసింది.

ఖాళీల భర్తీలో కేంద్ర వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం  చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఈ నెల 6న కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఉద్దేశ పూర్వకంగా కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారని, సోమవారం లోపు ఖాళీలను భర్తీ చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆగమేఘాల మీద నియామకాలు చేపట్టి కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకుంది.

ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలిగా నియమితులైన తేలప్రోలు రజని ఏపీ హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి. 1958లో ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారిపాలెంలో జన్మించారు. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1981లో గుంటూరులో లా ప్రాక్టీస్ ప్రారంభించిన రజని.. 2002లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కరీంనగర్, మెదక్, హైదరాబాద్ న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన రజని.. మే 2020లో పదవీ విరమణ చేశారు.

More Telugu News