'మా' సభ్యుల కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తా: ప్రకాశ్ రాజ్

12-09-2021 Sun 14:59
  • 'మా' ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్ 
  • జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు సమావేశం
  • హాజరైన 100 మంది నటీనటులు
  • తన ఆలోచనలు పంచుకున్న ప్రకాశ్ రాజ్
  • విందు రాజకీయాలపై బండ్ల గణేశ్ అభ్యంతరం
Prakash Raj held meeting with MAA members

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్ మా సభ్యులతో నేడు హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షెన్ సెంటర్ లో సమావేశమయ్యారు. ఈ కీలక విందు సమావేశానికి 'మా'లో సభ్యత్వం ఉన్న నటీనటులు 100 మంది వరకు హాజరయ్యారు. ఈ సమావేశంలో 'మా' ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, తమ ప్యానెల్ గెలిస్తే 'మా' సభ్యుల సంక్షేమానికి రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అసోసియేషన్ లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరని వెల్లడించారు.

కాగా, విందు రాజకీయాలపై బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మా' ఎన్నికల్లో ఓటు కావాలంటే ఫోన్ చేయండి అని స్పష్టం చేశారు. కరోనా వేళ విందుల పేరుతో సమావేశాలు వద్దు అని హితవు పలికారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు అని వ్యాఖ్యానించారు.