దేశవ్యాప్తంగా నీట్ ప్రారంభం... నిమిషం నిబంధనతో తీవ్ర నిరాశలో అనేకమంది విద్యార్థులు

12-09-2021 Sun 14:32
  • వైద్య విద్యా ప్రవేశాల జాతీయ పరీక్ష నీట్ నేడే
  • మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష
  • మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చినవారికి అనుమతి నిరాకరణ
  • బతిమాలుకున్న విద్యార్థులు
  • నిబంధనలకే కట్టుబడిన అధికారులు
NEET starts national wide

వైద్య విద్యా ప్రవేశాల జాతీయస్థాయి పరీక్ష నీట్ దేశవ్యాప్తంగా ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది. అయితే నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీయే) ప్రకటించినట్టుగానే అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద కచ్చితంగా ఆ నిబంధనను అమలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించలేదు. దాంతో అనేకమంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించకపోవడంతో, వారు అధికారులను బతిమాలుకోవడం పలుచోట్ల కనిపించింది. అయినప్పటికీ అధికారులు నిబంధనలకు కట్టుబడి వ్యవహరించడంతో విద్యార్థులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. హైదరాబాదులోని నిజాం కాలేజీ వద్దకు ఆలస్యంగా వచ్చారంటూ అధికారులు విద్యార్థులకు అనుమతి నిరాకరించారు.

నీట్ పరీక్ష నేడు దేశవ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాల్లో జరుగుతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ నిర్వహించనున్నారు. పెన్ను, పేపరు విధానంలో హిందీ, ఇంగ్లిష్ తో పాటు మొత్తం 11 భాషల్లో నీట్ నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే లక్షమందికి పైగా ఉన్నారు. తెలంగాణకు చెందినవారు 55 వేల మంది, ఏపీకి చెందినవారు 50 వేల మంది ఉన్నారు.

ఏపీలో కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, తెనాలి, నరసరావుపేట, విశాఖ, మంగళగిరి, మచిలీపట్నంలో నీట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో నీట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.