కేంద్ర పథకాలకు పేరు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారు: బండి సంజయ్​

12-09-2021 Sun 14:03
  • రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మండిపాటు
  • పథకాలపై చర్చకు సిద్ధమా? అని సవాల్
  • 16వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర
Sanjay Says Telangana Implementing Center Schemes By Changing Their Names

తెలంగాణలో ఉన్నవి కేంద్ర ప్రభుత్వ పథకాలేనని, పేరు మార్చి అమలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. ప్రజాసంగ్రామ యాత్ర 16వ రోజు పాదయాత్ర మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, అసలు ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినానికి ప్రభుత్వం అధికారిక హోదా తీసుకురాలేకపోతే.. తామే కేంద్రం నుంచి తీసుకొస్తామని అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి అమోఘమైన స్పందన వస్తోందని, ఎక్కడికెళ్లినా ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు. ఈ నెల 17న జరిగే పాదయాత్రలో అమిత్ షా పాల్గొంటారని ఆయన తెలిపారు.