Gujarat: ఈ నలుగురిలో ఒకరే గుజరాత్ కొత్త సీఎం!

  • గుజరాత్ చేరుకున్న కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, నరేంద్రసింగ్ తోమర్
  • మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం
  • బీజేపీ చీఫ్ సీఆర్ పటేల్‌కే చాన్స్!
Who will be next Gujarat CM Decision likely today

ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేసిన తర్వాత గుజరాత్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, నరేంద్రసింగ్ తోమర్ ఈ ఉదయం రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు గుజరాత్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు కనుక కొత్త సీఎంను ప్రకటిస్తే, రేపు (సోమవారం) ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.  

అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. తదుపరి చర్చల కోసమే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నేతలతో చర్చిస్తామన్నారు. కాగా, విజయ్ రూపానీ నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక, గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ మంత్రి గోర్ధన్ జడాఫియా, ప్రఫుల్ కె పటేల్‌లలో ఎవరో ఒకరిని గుజరాత్ పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పటేల్ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే, తాను సీఎం రేసులో లేనని పటేల్ నిన్ననే స్పష్టం చేయడం గమనార్హం.  

ఆగస్టు 2016లో ఆనందీబెన్ రాజీనామా తర్వాత నితిన్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారని భావించారు. అప్పట్లో విజయ్ రూపానీ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని అప్పట్లో ఆయన ప్రకటించారు. కానీ, చివరి నిమిషంలో ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News