పాఠ్యాంశంగా కరోనా వైరస్... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం

11-09-2021 Sat 21:50
  • యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా
  • 11వ తరగతిలో పాఠ్యాంశంగా కరోనా
  • త్వరలో 6-10 తరగతుల వారికీ పాఠ్యాంశంగా కరోనా
  • సమాజంలో భయం పోతుందంటున్న నిపుణులు
 Corona Virus lesson included in West Bengal education

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11వ తరగతి విద్యార్థుల సిలబస్ లో కరోనా వైరస్ ను ఓ పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది. కరోనా వైరస్ పాఠ్యాంశాన్ని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో బోధించనున్నారు. కరోనా పాఠ్యాంశాన్ని 6 నుంచి 10వ తరగతి వరకు బోధించాలన్న ప్రతిపాదనలు కూడా బెంగాల్ ప్రభుత్వం ముందు నిలిచాయి.

విద్యార్థులకు ఈ పాఠాల ద్వారా కరోనాపై మెరుగైన రీతిలో అవగాహన కలిగించేందుకు వీలవుతుందని, తద్వారా అనేక లాభాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తుగా నిర్ధారించడం సులభతరం అవుతుందని, వ్యాక్సినేషన్ పైనా చైతన్యం వస్తుందని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ యోగిరాజ్ రాయ్ తెలిపారు. కరోనా అంటే ఏర్పడిన భయాందోళనలు తొలగిపోతాయని వివరించారు.

కాగా, ఈ కరోనా పాఠంలో కరోనా వైరస్ పూర్తి వివరాలు, వైరస్ లక్షణాలు, ఎలా వ్యాపిస్తుంది? క్వారంటైన్ వివరాలు పొందుపరిచారు.