యూఏఈలో దిగిన ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు

11-09-2021 Sat 21:16
  • మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్‌
  • ఇంగ్లండ్‌తో టెస్ట్ రద్దు కావడంతో యూఏఈ బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు 
  • కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం అబుదాబి చేరుకున్న రోహిత్, బుమ్రా, సూర్యకుమార్
  • 6 రోజుల క్వారంటైన్ తర్వాత ఫ్రాంచైజీ బయోబబుల్‌లోకి ఆటగాళ్లు
Key players of Mumbai Indians land in UAE

ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు యూఏఈ పయనమయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లంతా యూఏఈ చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే తమ జట్టు ఆటగాళ్లు ముగ్గురు అబుదాబి చేరుకున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది.

ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం.. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌లు అబుదాబి చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉదయం అబుదాబిలో ల్యాండ్ అయ్యారు. అయితే అబుదాబి నిబంధనలను అనుసరించి ముగ్గురు ఆటగాళ్లు 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత జట్టుతో కలిసి బయోబబుల్ వాతావరణంలోకి అడుగుపెడతారు.

కాగా.. టీమిండియా కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొంతమంది సిబ్బందికి కోవిడ్ సోకడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన 5వ టెస్టు అర్థాంతరంగా రద్దయింది. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లీష్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్-2021 సెకండ్ షెడ్యూల్ కోసం యూఏఈ చేరుకోవాల్సి ఉంది.