రాజకీయ లబ్ది కోసం మోదీపై విమర్శలు చేసే కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలుసు: విజయశాంతి

11-09-2021 Sat 21:09
  • కేసీఆర్ పై విజయశాంతి విమర్శనాస్త్రాలు
  • కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతోందని వ్యాఖ్యలు
  • నియామకాలు ఇంటికే పరిమితం చేసుకున్నారని ఆరోపణ 
  • రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఉద్ఘాటన
Vijayasanthi comments on CM KCR and Telangana Govt

సీఎం కేసీఆర్ పైనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. బీజేపీ సర్కారు దేశ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే... కేంద్ర ప్రభుత్వంపై అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రధాని మోదీ నాయకత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబం నీళ్ల పేరుతో దోపిడీ చేస్తోందని, కొన్నితరాలు అనుభవించేలా నిధులు సమకూర్చుకుందని ఆరోపించారు. నియామకాలను వారి ఇంటికే పరిమితం చేసుకుందని విజయశాంతి విమర్శించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే ప్రధాని మోదీపై విమర్శలు చేసే కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి కల్పన చేస్తోందని తెలిపారు. ఈ పథకం గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఏపీతో పాటు తెలంగాణలోనూ సానుకూల ప్రభావం చూపుతుంటే, గులాబీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఎవరెన్ని చేసినా బీజేపీ ప్రభుత్వ పాలనపై, మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అని విజయశాంతి స్పష్టం చేశారు.