గుజరాత్ సీఎం రేసులో ముందున్న ఆ ఇద్దరు?

11-09-2021 Sat 20:04
  • సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా
  • తెరమీదకు ప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు పేర్లు 
  • ప్రస్తుత ఎమ్మెల్యే కానీ వారికీ ఛాన్స్  
Who Will Replace Vijay Rupani BJP Insiders List Contenders

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎం కోసం వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల పేర్లు కొత్తగా తెరమీదకొచ్చాయి. ప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దులలో ఎవరో ఒకరు సీఎం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రఫుల్ ఖోదా పటేల్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూల కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్నారు. ఇక ఆర్‌సీ ఫాల్దు ప్రస్తుత గుజరాత్ వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకు గుజరాత్ సీఎంగా ఎవరినీ ఎంపిక చేయలేదని, ఎవరి పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. అలాగే అవసరమైతే గుజరాత్‌‌లో ఎమ్మెల్యే కాని వారిని కూడా సీఎంగా ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా.. రాజీనామా అనంతరం విజయ్ రూపానీ పేర్కొన్న విషయాలు కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో గుజరాత్ అభివృద్ధి కోసం ఐదేళ్ల ప్రయాణం సాగించానని, ఇప్పుడు రాష్ట్రం కొత్త శక్తితో మరింత అభివృద్ధి వైపు సాగాలనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ రూపానీ ప్రకటించారు.

పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆదేశంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తేటతెల్లమైంది.