నరేశ్ గారూ... ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా?: బండ్ల గణేశ్

11-09-2021 Sat 18:50
  • సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
  • తమ ఇంటి నుంచే బయలుదేరారన్న నరేశ్ 
  • నరేశ్ వ్యాఖ్యలకు పలువురి ఖండన
  • ఎందుకు సార్ ఇలా మాట్లాడతారన్న బండ్ల
Bandla Ganesh condemns Naresh comments on Saitej issue

హీరో సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా నరేశ్ వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఖండించారు. ఎప్పుడేం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? అని అసహనం ప్రదర్శించారు. సాయితేజ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని, యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారని, బ్రహ్మాండంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు  బండ్ల గణేశ్  ఓ వీడియో విడుదల చేశారు.

"జరిగింది చిన్నప్రమాదమే. ఇలాంటి సమయంలో నరేశ్ గారు గతంలో ప్రమాదాల్లో మరణించినవారి పేర్లు చెప్పడం సబబు కాదు. రేసింగ్ చేశాడు, అది చేశాడు ఇది చేశాడు అని చెప్పడం అవసరమా సార్! మా ఇంటి దగ్గరికి వచ్చాడు... అంటూ ఎందుకు ఇవన్నీ చెప్పడం... తప్పు కదూ! ఇలాంటి సమయాల్లో ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థించాలి. అంతేతప్ప అసందర్భ విషయాలు మాట్లాడకూడదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి. సాయితేజ్ చిన్న ప్రమాదం నుంచి భగవంతుడి ఆశీస్సులతో క్షేమంగా బయటపడ్డాడు" అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.