పండుగ సీజన్ ఆఫర్లు ప్రకటించిన యమహా ఇండియా

11-09-2021 Sat 18:35
  • దేశంలో పండుగల సీజన్
  • ప్రస్తుతం వినాయకచవితి సందడి
  • రానున్న దసరా, దీపావళి
  • కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కంపెనీల ప్రయత్నాలు
Yamaha India announces festive offers

ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. తాజాగా వినాయక చవితి సందడి కొనసాగుతుండగా, ఆ తర్వాత దసరా, దీపావళి రానుండడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయ వాహన తయారీ దిగ్గజం యమహా కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఎంపిక చేసిన స్కూటర్లపై అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. ఫాసినో 125 ఎఫ్ఐ, ఫాసినా 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది.

ఫాసినో 125 ఎఫ్ఐ మోడల్ స్కూటర్ పై రూ.3,876 మేర ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గానీ, కనిష్ఠంగా రూ.999 డౌన్ పేమెంట్ తో స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం గానీ వినియోగదారులు ఎంచుకోవచ్చు. అంతేకాదు, స్క్రాచ్ అండ్ విన్ పోటీ కూడా నిర్వహిస్తోంది. ఈ పోటీలో లక్ష రూపాయలు గెలుచుకునే వీలుంటుంది. ఇందులో కనీస బహుమతి రూ.2,999 గెలుచుకునే అవకాశం ఉంటుందని యమహా పేర్కొంది.

ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోడల్ స్కూటర్ కొనుగోలుపై రూ.5,000 ఇన్ స్టాంట్ క్యాష్ బ్యాక్, లేదా, రూ,999 మినిమమ్ డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేసే అవకాశం ఇవ్వనున్నారు. ఈ మోడల్ కు కూడా స్క్రాచ్ అండ్ విన్ పోటీ వర్తింపజేస్తున్నారు. ఈ మోడల్ పై ఎక్చేంజి ఆఫర్ ను రూ.6,000గా పేర్కొన్నారు.

ఇక, రే జడ్ఆర్ 125 ఎఫ్ఐ మోడల్ విషయానికొస్తే, ఇది ఎంట్రీ లెవల్ మోడల్ తో పాటు హైబ్రిడ్ మోడల్లోనూ అందుబాటులో ఉంది. ఫాసినో 125 ఎఫ్ఐకి ప్రకటించిన ప్రయోజనాలే రే జడ్ఆర్ 125 ఎఫ్ఐ నాన్-హైబ్రిడ్ మోడల్ కొనుగోలుపైనా లభిస్తాయి.