Medicine From Sky: డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ... ప్రారంభించిన కేంద్రమంత్రి సింథియా, తెలంగాణ మంత్రి కేటీఆర్

  • వికారాబాద్ లో శ్రీకారం
  • డ్రోన్ లో మందుల బాక్సు ఉంచిన సింథియా
  • ఏరియా ఆసుపత్రికి మందుల డెలివరీ
  • టెక్నాలజీని సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహిస్తారన్న కేటీఆర్
Medicine delivery through drones in Vikarabad

డ్రోన్ల వినియోగం బహుముఖ రీతిలో విస్తరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎక్కడో కాదు... తెలంగాణలోనే. వికారాబాద్ జిల్లాలో రవాణా సదుపాయాలు లేని మారుమూల అటవీప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' అని పేరుపెట్టారు.

నేడు వికారాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' పథకాన్ని ప్రారంభించారు. మందులు ఉన్న బాక్సును సింథియా డ్రోన్ లో ఉంచి ప్రారంభోత్సవం చేశారు. మొత్తం మూడు డ్రోన్లలో మందులు ఉంచి వికారాబాద్ రీజనల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలనాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయింది.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహిస్తుంటారని తెలిపారు. టెక్నాలజీ ప్రధానంగా సామాన్యుడికి ఉపయోగపడాలన్నది ఆయన ఆకాంక్ష అని అన్నారు. డ్రోన్ల ద్వారా మందులే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కూడా తరలిస్తామని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రాజెక్టులో గ్లోబల్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే డ్రోన్ల సరఫరాపై తెలంగాణ ప్రభుత్వ ఎనిమిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

More Telugu News