రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందించిన సుచరిత

11-09-2021 Sat 15:08
  • గుంటూరులో హత్యకు గురైన విద్యార్థిని రమ్య
  • రమ్య సోదరికి ఉద్యోగం కల్పించిన సీఎం
  • ఆర్థిక సహాయం కూడా అందజేత
Sucharitha handovers land patta to Ramya family

గుంటూరులో దళిత విద్యార్థిని రమ్యను ప్రేమోన్మాది దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

మరోవైపు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. రమ్య సోదరికి ఉద్యోగం, ఆర్థిక సాయం, నివాస స్థలం ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం బాధిత కుటుంబానికి సాయం అందించింది. రమ్య కుటుంబానికి ఈరోజు ఐదు సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను హోంమంత్రి సుచరిత అందజేశారు.

ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, రమ్య కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు. రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా, వెంటనే ఉద్యోగం కల్పించాలని జగన్ ఆదేశించారని తెలిపారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రతి మహిళ దిశ యాప్ ను ఉపయోగించాలని మంత్రి కోరారు. పాలడుగు ఘటనలో పోలీసు విచారణ జరుగుతోందని... నిందితులను పట్టుకోగానే మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. విచారణ దశలో ఉన్న కేసు వివరాలను బహిరంగపరిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని అన్నారు.