మళ్లీ వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్... కొత్త డేట్ ఇప్పుడే ప్రకటించలేమన్న చిత్రయూనిట్

11-09-2021 Sat 14:22
  • రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • అక్టోబరు 13న రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం
  • అక్టోబరు 21 వరకు పోస్ట్ ప్రొడక్షన్!
RRR release postponed again

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదల మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి అక్టోబరు 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేందుకు అక్టోబరు 21 వరకు సమయం పడుతుందని, దాంతో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, సినిమా హాళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం వల్ల  కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇప్పుడే ప్రకటించలేమని వెల్లడించింది. త్వరలోనే ప్రపంచ సినిమా కార్యకలాపాలు పుంజుకుంటే, వీలైనంత త్వరగా ఆర్ఆర్ఆర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చిత్రబృందం పేర్కొంది.