అక్బర్ సెల్ఫీ వీడియోపై స్పందించిన సీఎం జగన్ కార్యాలయం.. విచారణకు ఆదేశం

11-09-2021 Sat 13:55
  • అక్బర్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశం
  • సీఐని విధుల నుంచి తప్పించామన్న ఎస్పీ
  • అక్బర్ కుటుంబానికి రక్షణ కల్పిస్తామన్న ఎస్పీ
AP CMO responds on Akbar videos

పొలం వివాదానికి సంబంధించి అక్బర్ బాషా కుటుంబసభ్యుల సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ భూమిని కబ్జా చేశారని... ఆయనకు సీఐ సహకరించారని చంద్రబాబు ఆరోపించారు.

మరోవైపు ఈ అంశంపై సీఎం కార్యాలయం స్పందించింది. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. దీంతో అక్బర్ కుటుంబసభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను అక్బర్ కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామని చెప్పారు. దువ్వూరు పోలీసుల సహకారంతో వారిని కాపాడగలిగామని అన్నారు. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని చెప్పారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అన్నారు.

విచారణ పూర్తయ్యేంత వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ వ్యవహారంలో సీఐకానీ, ఇతర పోలీసుల తప్పు కానీ ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్బర్ కుటుంబానికి పూర్తి భద్రతను కల్పిస్తానని తెలిపారు.