రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక!

11-09-2021 Sat 11:30
  • నటుడిగా మంచి గుర్తింపు
  • దర్శకుడిగా ప్రయోగాలు
  • గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఛాన్స్
  • త్వరలోనే సెట్స్ పైకి  
Rashmika in Rahul Ravindran movie

యువ కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ కి మంచి పేరు ఉంది. దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవడానికి ఆయన కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. నాగార్జునతో 'మన్మథుడు 2' చేసిన ఆయన, పరాజయంతో పాటు విమర్శలను ఎదుర్కున్నాడు. ఆ సినిమా ఫలితం నుంచి బయటపడటానికి ఆయనకి కొంత సమయం పట్టింది.

ఆ తరువాత ఆయన ఓ లేడీ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకుని గీతా ఆర్ట్స్ వారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కథకి ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ కథకు రష్మిక అయితే కరెక్టుగా సరిపోతుందని భావించిన ఆయన, ఆమెను సంప్రదించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా అంటే కథలో తప్పకుండా విషయం ఉంటుందనే ఒక నమ్మకం ఆర్టిస్టులలో ఉంది. ప్రేక్షకుల్లోను అదే అభిప్రాయం ఉంది. అందువల్లనే వెంటనే రష్మిక అంగీకరించిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.