తాలిబన్ల ఆటవిడుపు.. విమానం రెక్కకు తాడుకట్టి ఊయల ఊగిన తాలిబన్లు!

11-09-2021 Sat 09:45
  • వీడియోను పోస్టు చేసిన చైనా విదేశాంగ శాఖ అధికారి
  • అమెరికాపై ఆగ్రహం
  • పాలకుల కాలం నాటి శ్మశాన వాటిక అంటూ ఫైర్
Talibans have turned their planes into swings and toys

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారం చెలాయిస్తున్న తాలిబన్లు సరదా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌లో హల్‌చల్ చేసిన తాలిబన్లు చిన్నారులు ఆడుకునే బొమ్మకార్లలో తిరిగి సంబరపడిపోయారు. తాజాగా ఓ యుద్ధ విమానం రెక్కకు తాడుకట్టి ఊయల ఊగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

చైనా విదేశాంగశాఖకు చెందిన అధికారి లిజైన్ ఝావో తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది పాలకుల కాలం నాటి శ్మశాన వాటిక. వారి యుద్ధ విమానాలు. ఆ విమానాలను తాలిబన్లు ఊయలలా, ఆట వస్తువుల్లా మార్చుకుంటున్నారు’’ అంటూ పేర్కొన్నారు. కాగా, తాలిబన్లు ఊయల ఊగుతున్న ఆ ప్రాంతం గతంలో అమెరికా బలగాల స్థావరంగా తెలుస్తోంది.