తమిళనాడులో ఎంఎన్‌కే పార్టీ నేత దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే నరికి చంపిన దుండగులు

11-09-2021 Sat 07:51
  • వెల్లూరు జిల్లా వాణియంబాడిలో ఘటన
  • అక్రమ్‌పై కక్ష పెంచుకున్న గంజాయి గ్యాంగ్
  • ఇంటి బయటే కత్తులతో విచక్షణ రహితంగా దాడి
MNMK Leader Murderd in Tamil Nadu

తమిళనాడులో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఎన్ఎంకే ముఖ్య నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. వెల్లూరు జిల్లా వాణియంబాడిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంఎన్ఎంకే నేత వసీం అక్రమ్ వాణియంబాడిలోని జీవనగర్‌లో ఉంటున్నారు. అక్కడ గంజాయి గ్యాంగ్ చెలరేగిపోతుండడంతో వారి ఆగడాలపై అక్రమ్ పోరాడుతున్నారు.

దీంతో ఇంతియాజ్ గ్యాంగ్ వసీం అక్రమ్‌పై కక్ష పెంచుకుంది. ఆయనను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నిన్న అక్రమ్ బైక్‌పై ఇంటి నుంచి బయటకు రాగా, కారులో వచ్చి అక్కడే మాటువేసిన ఐదుగురు దుండగులు ఆయనపై దాడికి దిగారు. బైక్‌ను అడ్డుకుని ఆయనను కిందపడేసి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంతియాజ్ గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు.