వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులపై పంజాబ్ సీఎం కొరడా.. టీకా తీసుకోని వారికి బలవంతపు సెలవులు!

11-09-2021 Sat 06:28
  • కొవిడ్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష
  • టీకా తీసుకోని ఉద్యోగులు 15 తర్వాత ఇంటికే
  • ఈ నెలాఖరు వరకు కొవిడ్ ఆంక్షల పొడిగింపు
Govt employees to be sent on compulsory leave if first dose of Covid vaccine not taken

కరోనా టీకా కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ కొరడా ఝళిపించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నిన్న అధికారులతో వర్చువల్‌గా సమీక్షించిన సీఎం.. ప్రభుత్వ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక కృషి జరిగినట్టు చెప్పారు. అనారోగ్య కారణాలు మినహా టీకా వేయించుకోని వారిని ఈ నెల 15 తర్వాత బలవంతపు సెలవులపై పంపిస్తామన్నారు.

వచ్చేది పండుగల సీజన్ కావడంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కొవిడ్ ఆంక్షలను ఈ నెల చివరి వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అమరీందర్ ‌సింగ్ తెలిపారు.