సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ ఓపెనర్ గంభీర్ ప్రశంసలు

10-09-2021 Fri 22:36
  • శ్రేయాస్ అయ్యర్ కన్నా సూర్యకుమార్ ప్రతిభావంతుడు
  • టీ20కి కావలసిన మెళకువలన్నీ ఉన్న ఆటగాడు: గంభీర్
  • ప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ పేరు
Gambhir picks Suryakumar over Shreyas Iyer

టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించిన యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానం నలువైపులా బంతిని బాదగల సత్తా సూర్యకుమార్‌కు ఉందని కితాబునిచ్చిన గంభీర్.. అతనో బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెచ్చుకున్నాడు. టీ20 ఫార్మాట్ ఆడేవారిలో ఉండాల్సిన అన్ని మెళకువలు సూర్యకుమార్ వద్ద ఉన్నాయని చెప్పాడు.

మరో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌తో పోలిస్తే సూర్యకుమార్ ఎంతో ప్రతిభ గల ఆటగాడని కొనియాడాడు. ‘‘సూర్యకుమార్ చాలా భిన్నమైన ప్లేయర్. అసాధారణ ఆటగాడు. బంతిని మైదానంలో నలువైపులా బాదగలిగే వారే టీ20 ఫార్మాట్‌కు అవసరం. టీ20 అంటేనే అది’’ అని గంభీర్ అన్నాడు.

కాగా, టీ20 జట్టులో సూర్యకుమార్ ఎంపికైన తర్వాత సోషల్ మీడియాలో.. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్‌ అభిమానుల మధ్య పెద్ద చర్చ మొదలైంది. ఈ జట్టులో శ్రేయాస్, సూర్యకుమార్ వీరిలో ఎవరు ఉండాలని పోల్స్ కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.