చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన సాయితేజ్... ఆసుపత్రికి పరుగులు తీసిన కుటుంబ సభ్యులు

10-09-2021 Fri 22:26
  • జూబ్లీహిల్స్, గచ్చిబౌలి మార్గమధ్యంలో ప్రమాదం
  • స్పోర్ట్స్ బైకు స్కిడ్ కావడంతో ఘటన
  • ముఖం, ఛాతీ, పొట్టపై గాయాలు
  • కొనసాగుతున్న చికిత్స
Saitej gets conscious after treatment

హీరో సాయితేజ్ హైదరాబాదులో స్పోర్ట్స్ బైకుపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఛాతీ, పొట్ట, ముఖం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న సాయితేజ్ ను మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సాయితేజ్ స్పృహలోకి వచ్చారు. కాగా, సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్తతో మెగా కుటుంబంలో ఆందోళన నెలకొంది. సాయితేజ్ కుటుంబ సభ్యులు మెడికవర్ ఆసుపత్రికి పరుగులు తీశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం45, గచ్చీబౌలి మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన స్పోర్ట్స్ బైకుపై వేగంగా వెళుతున్న తరుణంలో కేబుల్ బ్రిడ్జిపై అదుపు తప్పింది. ఒక్కసారిగా స్కిడ్ కావడంతో సాయితేజ్ తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఘటన జరిగిన సమయంలో సాయితేజ్ బైకుపై గంటకు 120 కిమీ వేగంతో వెళుతున్నట్టు తెలిసింది. రోడ్డుపై ఇసుక ఉండడంతో ఆయన బైకును అదుపు చేయలేక ప్రమాదం బారినపడ్డట్టు ప్రత్యక్షసాక్షుల కథనం.