తనకు గొడుగు పట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టెక్ మహీంద్రా సీఈవో

10-09-2021 Fri 22:01
  • ఇటీవల హైదరాబాదులో పర్యటించిన సీపీ గుర్నానీ
  • పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
  • ఈ కార్యక్రమాలకు హాజరైన మంత్రి కేటీఆర్
  • కేటీఆర్ మర్యాదలకు ముగ్ధుడైన సీపీ గుర్నానీ
Tech Mahindra CEO thanked Telangana minister KTR

కొన్నిరోజుల కిందట టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ హైదరాబాదులో పర్యటించారు. నగరంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ లోని సెయింట్ థెరెస్సా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభోత్సవంలోనూ, ఏటూరు నాగారం ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత కార్యక్రమంలోనూ గుర్నానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విచ్చేశారు.

అయితే, వర్షం పడుతుండడంతో కేటీఆర్ స్వయంగా సీపీ గుర్నానీకి గొడుగు పట్టారు. ఓ రాష్ట్రానికి మంత్రి అయివుండీ తన పట్ల చూపిన శ్రద్ధకు గుర్నానీ ముగ్ధుడయ్యారు. తన స్పందనను నేడు ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు.

"మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో బాగుంది కేటీఆర్. మీరు మనస్ఫూర్తిగా వ్యవహరించిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అసలు, మీ స్థాయి వ్యక్తి నాకు గొడుగు పట్టడం అనేది ఎంతో అరుదైన విషయం... ఇది ప్రతి రోజు జరిగే పని కాదు. అందుకు నా కృతజ్ఞతలు" అని తన మనోభావాలను పంచుకున్నారు. అంతేకాదు, తనకు కేటీఆర్ గొడుగు పట్టినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.