EngvsInd: భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు రద్దుతో ఎంత నష్టమో తెలుసా?

  • భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా పలువురికి కరోనా
  • ఇరు బోర్డుల అంగీకారంతో మ్యాచ్ రద్దు
  • వచ్చే ఏడాది వేరుగా మ్యాచ్ నిర్వహించాలని యోచన
know the cost of cancelling the 5th test between England and India

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు శిబిరంలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. జట్టు కోచ్ రవిశాస్త్రి పుస్తకం ‘స్టార్ గేజింగ్’ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆయనతోపాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐదో మ్యాచ్ నిర్వహించడం అసాధ్యంగా మారింది. అనంతరం ఈ విషయంపై బీసీసీఐ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) చర్చించుకున్నాయి. ఆ తర్వాత మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

అయితే ఈ ఒక్క టెస్టు మ్యాచ్ రద్దవడం వల్ల లాంక్‌షైర్ క్రికెట్‌కు, ఈసీబీకి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోవడంతో వీరికి సుమారు 30 మిలియన్ పౌండ్లు అంటే మన లెక్కల్లో దాదాపు రూ.304 కోట్లు నష్టం వచ్చినట్లేనట. మ్యాచ్ ప్రసార హక్కులు తదితర మార్గాల ద్వారా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం మొత్తం పోయినట్లే.

ఈ నేపథ్యంలో రద్దయిన మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహించాలని ఈసీబీ కోరిందట. దీనికి బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కార్యదర్శి జైషా తెలిపారు. ఈ మ్యాచ్ 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్నందున రెండు జట్లకూ అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

అయితే ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జరిగినా ప్రస్తుత సిరీస్‌తో దీనికి సంబంధం ఉండదని, దాన్ని వేరే మ్యాచ్‌గానే పరిగణిస్తామని ఈసీబీ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత టెస్టు సిరీస్ 2-1తో అనధికారికంగా భారత్ వశమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

More Telugu News