రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం

10-09-2021 Fri 21:38
  • బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం
  • వాతావరణ కేంద్రం తాజా హెచ్చరిక
  • ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టీకరణ
Weather forecast for AP

ప్రస్తుతం బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, రాబోయే రెండ్రోజుల్లో అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని తెలిపింది.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు మంగళవారం వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.