ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది... మనం కృతజ్ఞత చూపాలి: గవాస్కర్

10-09-2021 Fri 21:24
  • టీమిండియా శిబిరంలో కరోనా వ్యాప్తి
  • మాంచెస్టర్ టెస్టు రద్దు
  • రీషెడ్యూల్ చేయాలని భావిస్తున్న ఇరుదేశాల బోర్డులు
  • గతంలో ఇంగ్లండ్ చొరవ చూపిందన్న గవాస్కర్
Gavaskar opines on Team India and England test series

అనూహ్యరీతిలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేయాలని ఇరుదేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.

2008లో ముంబయిలో ఉగ్రదాడులు జరిగాయని, ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టు భారత్ లో పర్యటిస్తోందని గుర్తుచేశారు. ఉగ్రదాడుల పర్యవసానంగా 7 మ్యాచ్ ల సిరీస్ లోని చివరి రెండు వన్డేలు రద్దు చేశారని తెలిపారు. దాంతో ఇంగ్లండ్ జట్టు స్వదేశానికి పయనమైందని వివరించారు. అయితే, వన్డే సిరీస్ అనంతరం జరగాల్సిన రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ అనిశ్చితి నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టు భారత్ కు మళ్లీ వచ్చిందని గవాస్కర్ పేర్కొన్నారు. తద్వారా ఇంగ్లండ్ జట్టు అందరి అభినందనలకు పాత్రురాలైందని తెలిపారు.

ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ఓటమిపాలైనప్పటికీ, భారత్ కు మళ్లీ రావాలన్న ఆ జట్టు నిర్ణయం ఎంతో గొప్పదని కొనియాడారు. నాటి ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ పర్యటన కొనసాగేందుకు ఎంతో చొరవ చూపాడని కితాబునిచ్చారు. ఇప్పుడు కరోనా కారణంగా ఓ టెస్టు నిలిచిపోయిందని, గతంలో వారు చూపిన సానుకూల ధోరణిని ఇప్పుడు మనం చూపాల్సిన అవసరం ఉందని, వారిపట్ల కృతజ్ఞత ప్రదర్శించాలని గవాస్కర్ సూచించారు.

కాగా, మాంచెస్టర్ లో నేడు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ను వచ్చే ఏడాది వేసవిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత జట్టు 2022 జులైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ టూర్లో 6 పరిమిత ఓవర్ల మ్యాచ్ లలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లకు ముందు గానీ, తర్వాత గానీ ఏకైక టెస్టు నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ పరిశీలిస్తున్నాయి.