విద్యుత్ దీపాలు, నక్షత్రాల మధ్య వెలుగుల పోటీ!.. ఫొటో తీసిన ఫ్రెంచి వ్యోమగామి
- భూమి చుట్టూ రంగుల దుప్పటిలా వాయువులు
- ఐఎస్ఎస్ నుంచి కనిపిస్తున్న రమణీయ దృశ్యం
- ఫొటో తీసిన థామస్ పెస్కెట్ అనే ఫ్రెంచి వ్యోమగామి
ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన థామస్.. ‘‘కొన్నిసార్లు అంతరిక్షంలోని నక్షత్రాలు, భూమిపై ఉండే విద్యుత్ దీపాలు.. ఏవి ఎక్కువగా కాంతివంతంగా, అందంగా మెరుస్తున్నాయని పోటీ పడుతుంటాయి’’ అంటూ ఒక పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
భూ వాతావరణంలో 75 కిలోమీటర్ల ఎత్తున సోడియం పొర వెలుగులు కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లోనే కనిపిస్తాయట. సూర్యుడు, నక్షత్రాల కాంతి, రేడియేషన్ వల్ల ఈ పొర నారింజ రంగులో మెరుస్తుంది.
ఈ పొరపైనే చాలా పల్చగా ఆకుపచ్చ రంగు పొర కూడా కనిపిస్తోంది. ఆక్సిజన్ అయాన్లతో కూడిన పొరపై సూర్యుడి రేడియేషన్ పడటంతో ఇలా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ చిత్రం మాత్రం అంతరిక్ష ఔత్సాహికులకు తెగనచ్చేసింది.