Ira Basu: ఈ ఫొటోలో ఉన్న బిచ్చగత్తె ఎవరో తెలిస్తే నమ్మలేరు!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • బారా బజార్ ప్రాంతంలో వృద్ధురాలి భిక్షాటన
  • పీహెచ్ డీ చేసిన వైనం
  • క్రికెట్, టేబుల్ టెన్నిస్ లో రాష్ట్రస్థాయి క్రీడాకారిణి
  • మాజీ సీఎంకు స్వయానా మరదలు
Former CM sister in law in a pity conditions

ఎంతో పేదరికం, దుర్భర పరిస్థితుల్లోనే ఎవరైనా భిక్షాటనకు సిద్ధపడతారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి, క్రీడల్లోనూ నైపుణ్యం చూపించి, ఉపాధ్యాయురాలిగా రిటైర్ అయిన ఓ మహిళ భిక్షాటన చేస్తుందని ఎవరూ నమ్మలేరు. కానీ పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లా బారా బజార్ ప్రాంతంలో ఫుట్ పాత్ లపై  భిక్షాటన చేసే ఇరా బసు అనే వృద్ధురాలి జీవితంలోకి తరచి చూస్తే నివ్వెరపోతారు.

ఇరా బసు వైరాలజీలో పీహెచ్ డీ చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడే ఆ విద్యాధికురాలు క్రికెట్, టేబుల్ టెన్నిస్ లోనూ ప్రతిభ చూపించేవారు. అప్పట్లో ఆమె రాష్ట్రస్థాయిలో క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడారు. ఓ గాళ్స్ హైస్కూల్లో టీచర్ గా చేరిన ఆమె 2009లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఇరా బసు జీవితం దుర్భరమైంది. చివరికి పుట్ పాత్ పై బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్నారు.

ఆమె గతంలో పనిచేసిన స్కూల్ ప్రిన్సిపల్ స్పందిస్తూ, పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమెకు నెలకు కొంత మొత్తం వస్తుందని, ఎందుకనో ఆమె ఇంతవరకు తన పెన్షన్ పత్రాలు సమర్పించలేదని వెల్లడించారు.

ఇక అసలు విషయానికొస్తే... ఇరా బసు ఎవరో కాదు... గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్యకు స్వయానా మరదలు. ఆయన భార్య మీరాకు తోడబుట్టిన చెల్లెలు. మాజీ సీఎం భార్య చెల్లెలు ఈ స్థితిలో ఉండడాన్ని బారా బజార్ లోని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల టీచర్స్ డే సందర్భంగా ఆమెకు కొందరు స్థానికులు సత్కారం చేశారు.

ఈ సందర్భంగా ఇరా బసు మాట్లాడుతూ, తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్నప్పుడు తాను ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని, ఇప్పుడు కూడా తానేదో ప్రముఖురాలిని అనుకోవడంలేదని స్పష్టం చేశారు. ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న అధికారులు వైద్య చికిత్స కోసం కోల్ కతా తరలించారు.

More Telugu News