పండగ రోజున కొత్త సినిమా మొదలెట్టిన నితిన్!

10-09-2021 Fri 16:25
  • నితిన్ సరసన 'ఉప్పెన' భామ కృతిశెట్టి 
  • దర్శకుడిగా ఎస్.ఆర్. శేఖర్ పరిచయం
  • తొలిషాట్ కు క్లాప్ కొట్టిన అల్లు అరవింద్
  • ఈ సాయంకాలం ప్రకటించనున్న టైటిల్  
Nithin started his new film

యువ కథానాయకుడు నితిన్ జోరుపెంచాడు. వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' చిత్రాన్ని పూర్తిచేశాడు. తమన్నా, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న డిస్నీ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్ పనుల్లో ఓపక్క బిజీగా వున్న నితిన్.. వినాయక పండుగ రోజున మరో కొత్త చిత్రాన్ని హైదరాబాదులో ప్రారంభించాడు.

ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ అనే కుర్రాడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'ఉప్పెన' చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా బిజీ అయిపోయి.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న అందాలతార కృతిశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది.

నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ ను హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసి, క్లాప్ కొట్టారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ని ఈ సాయంకాలం ప్రకటిస్తారు. ఇది నితిన్ నటిస్తున్న 31వ చిత్రం.