ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుపై రషీద్ ఖాన్ అలక... కెప్టెన్సీకి గుడ్ బై

10-09-2021 Fri 16:20
  • టీ20 వరల్డ్ కప్ కు ఆఫ్ఘన్ జట్టు ఎంపిక
  • తనను సంప్రదించలేదన్న రషీద్ ఖాన్
  • కెప్టెన్ గా కొనసాగలేనని ప్రకటన
  • మహ్మద్ నబీకి కెప్టెన్సీ దక్కే అవకాశాలు
Rashid Khan quits captaincy

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్లో సంక్షోభం నెలకొంది. తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా టీ20 వరల్డ్ కప్ కోసం జాతీయ జట్టును ఎంపిక చేశారంటూ కెప్టెన్ రషీద్ ఖాన్ అలకబూనాడు. అంతేకాదు, తాజా పరిణామం తనను తీవ్రంగా బాధించిందంటూ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సందేశం వెలువరించాడు.

"ఓ కెప్టెన్ గా జాతీయ జట్టు ఎంపికలో పాల్గొనే హక్కు నాకుంది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు, సెలెక్షన్ కమిటీ ఈ విషయంలో నన్ను విస్మరించాయి. నా ప్రమేయం లేకుండానే టీ20 జట్టును ఎంపిక చేశాయి. అందుకే, తక్షణమే ఆఫ్ఘనిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ గా తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. ఆఫ్ఘనిస్థాన్ తరఫున ఆడడాన్ని ఎప్పటికీ గర్వకారణంగా భావిస్తాను" అని వివరించాడు.

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టులో రషీద్ ఖాన్ ను కెప్టెన్ గానే పేర్కొన్నారు. ఇటీవల జట్టులోని కొందరు ఆటగాళ్లను కూడా తాజాగా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆటగాడిగా జట్టులో అతడిని కొనసాగిస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. రషీద్ ఖాన్ కెప్టెన్ గా తప్పుకున్న నేపథ్యంలో సీనియర్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీకి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి.