భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు నిరవధిక వాయిదా

10-09-2021 Fri 14:16
  • భారత జట్టులో కరోనా కలకలం
  • కోచ్ రవిశాస్త్రితో పాటు పలువురికి పాజిటివ్
  • నిన్న ఫిజియో యోగేశ్ పర్మార్ కు పాజిటివ్
  • పరస్పరం సంప్రదింపులు జరిపిన ఈసీబీ, బీసీసీఐ
Fifth test between India and England indefinitely postponed

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో నేడు ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడింది. టీమిండియా శిబిరంలో కరోనా కలకలం రేగడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).... భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. బహుశా ఈ టెస్టు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది.

ఇటీవల నాలుగో టెస్టు జరుగుతున్న సమయంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడ్డారు. నిన్న జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆటగాళ్లు మైదానంలో దిగేందుకు వెనుకంజ వేశారు. ఓ సీనియర్ ఆటగాడు తాను బరిలో దిగేది లేదని టీమిండియా మేనేజ్ మెంట్ కు తెగేసి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలను గమనించిన ఆతిథ్య క్రికెట్ బోర్డు ఈసీబీ చివరి టెస్టును ప్రస్తుతానికి వాయిదా వేయడమే మేలని భావించింది.

ఐదు టెస్టుల ఈ సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. కాగా, ఈ టెస్టును ఒకరోజు వాయిదా వేసి, రేపటి నుంచి జరపడానికి కూడా వీల్లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే... యూఏఈలో ఈ నెల 19 నుంచి ఐపీఎల్ రెండో దశ జరగాల్సి ఉంది. దాంతో భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ బయోబబుల్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఐపీఎల్ బయోబబుల్ షెడ్యూల్ ముందే నిర్ణయించారు.

అటు ఐపీఎల్ కూడా వాయిదా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ రెండో దశ ముగిసిన వెంటనే యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టును నిరవధికంగా వాయిదా వేశారు.