రెండు గంట‌ల్లో నిందితుడిని ప‌ట్టుకుంటాం: సైదాబాద్ బాలిక అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు

10-09-2021 Fri 11:54
  • సైదాబాద్ లోని  సింగ‌రేణి కాల‌నీలో బాలిక అనుమానాస్పద మృతి 
  • నిందితుడికి త్వ‌ర‌గా శిక్ష ప‌డేలా చేస్తామ‌న్న డీసీపీ
  • త‌క్ష‌ణ సాయం కింద బాలిక కుటుంబానికి రూ.50 వేలు
  • కుటుంబానికి రెండు ప‌డ‌క గ‌దుల ఇల్లు
  • కుటుంబంలో ఒక‌రికి ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగం  

హైద‌రాబాద్‌లోని సైదాబాద్, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలిక అదృశ్య‌మై, ఆమె ప‌క్కింట్లో నివ‌సించే రాజు అనే యువ‌కుడి గదిలో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డిన విష‌యం తెలిసిందే. నిందితుడు రాజు ప‌రారీలో ఉన్నాడు. దీంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ చంపాపేట్ వ‌ద్ద సాగ‌ర్‌రోడ్డుపై స్థానికులు పెద్ద ఎత్తున ధ‌ర్నాకు దిగ‌డంతో అక్క‌డ భారీగా పోలీసులు మోహ‌రించారు.

నిందితుడిని త‌మ‌కు అప్ప‌గించాల్సిందేన‌ని వారు ఇప్ప‌టికీ డిమాండ్ చేస్తున్నారు. అయితే, వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష‌ప‌డేలా చేస్తామ‌ని డీసీపీ ర‌మేశ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆందోళ‌న విర‌మించాల‌ని స్థానికుల‌ను కోరారు. మ‌రో రెండు గంట‌ల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామ‌ని చెప్పారు.

మ‌రోవైపు అక్కడ‌కు చేరుకున్న హైద‌రాబాద్‌ క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ బాలిక కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. త‌క్ష‌ణ సాయం కింద బాలిక కుటుంబానికి రూ.50 వేలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పారు.

బాలిక కుటుంబానికి రెండు ప‌డ‌క గ‌దుల ఇల్లు, బాలిక కుటుంబంలో ఒక‌రికి ఔట్ సోర్సింగ్ విభాగం కింద ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. బాలిక కుటుంబంలోని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఉచిత విద్య అందిస్తామ‌ని చెప్పారు. కాగా, బాలిక‌పై రాజు అత్యాచారానికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత చంపేసి, పారిపోయాడ‌ని స్థానికులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.