కరోనా నుంచి కోలుకున్నా కొందరు చిన్నారులను వేధించే ‘లాంగ్ కొవిడ్’

10-09-2021 Fri 10:04
  • బ్రిటన్ అధ్యయనంలో వెల్లడి
  • కరోనా సోకిన చిన్నారుల్లో 4 శాతం మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు
  • కారణాన్ని గుర్తించలేకపోయిన శాస్త్రవేత్తలు
Kids can suffer through long COVID symptoms

కరోనా బారినపడి కోలుకున్న చిన్నారుల్లోనూ లాంగ్ కొవిడ్ దీర్ఘకాలం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తితే దానిని లాంగ్ కొవిడ్‌గా వ్యవహరిస్తారు. అయితే, ఈ లాంగ్ కొవిడ్ ముప్పు పెద్దలతో పోలిస్తే చిన్నారులకు తక్కువేనని బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం పేర్కొంది. కరోనా సోకిన చిన్నారుల్లో 4 శాతం మందికి ఇన్ఫెక్షన్ సోకిన నెల తర్వాత కూడా ఆ ఇబ్బందులు ఉంటాయని అధ్యయనం స్పష్టం చేసింది. అదే పెద్దల్లో అయితే అది 30 శాతంగా ఉన్నట్టు తెలిపింది.

అలసట, తలనొప్పి, వాసన సామర్థ్యం తగ్గిపోవడం వంటి లాంగ్ కొవిడ్ లక్షణాలు పిల్లల్లో కనిపించగా, రెండు నెలల తర్వాత వాటిలో చాలా వరకు తగ్గినట్టు అధ్యయనకారులు గుర్తించారు. అయితే,  దగ్గు, చాతీలో నొప్పి, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి కూడా కొందరు చిన్నారుల్లో గుర్తించినట్టు పేర్కొన్నారు.

శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావం చూపే ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్’ సమస్య మాత్రం చాలా అరుదుగానే కనిపించినట్టు వివరించారు. అయితే, ఈ లాంగ్ కొవిడ్‌కు నిర్దిష్ట కారణం ఏంటన్న దానిని మాత్రం శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. శరీరంలో కొనసాగుతున్న వైరస్, ఇన్‌ఫ్లమేషన్, లేదంటే ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.