Lord Ganesha: సొంత వాహనాల్లో ఖైరతాబాద్ రావొద్దు: ట్రాఫిక్ పోలీసులు

Amid Ganesh Navratri Hyderabad traffic police issue traffic rules
  • నేటి నుంచి వినాయక నవరాత్రులు
  • ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
  • వాహన పార్కింగ్‌‌పై సూచనలు
ఖైరతాబాద్ మహాగణేశుని దర్శించుకోవాలనుకునే భక్తులు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. నేటి నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు ఈ మేరకు సూచించారు. అలాగే, పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు తెలిపారు.

ఇలా అనుమతి లేదు: ఖైరతాబాద్ ప్రధాన రహదారిలో రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా గణేశుడి విగ్రహం వైపు వాహనాలకు అనుమతి లేదు. అలాగే, ఐమ్యాక్స్, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రభుత్వ ముద్రణాలయం వైపు కూడా వాహనాలకు అనుమతి లేదు.

మళ్లింపు: లక్డీకాపూల్‌లోని రాజ్‌దూత్ మార్గంలో వచ్చే వాహనాలను వార్డు కార్యాలయం వైపు కానీ, మార్కెట్ వైపు కానీ మళ్లిస్తారు.

పార్కింగ్: నెక్లెస్ రోటరీ మీదుగా దర్శనం కోసం వచ్చే వారి కార్లను ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ పార్కులో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వృద్ధులు, నడవలేని వారికి కొంత వెసులుబాటు ఉంది. వీరు తమ వాహనాలను మింట్ కాంపౌండ్‌లో పార్క్ చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలను మింట్ కాంపౌండ్ రోడ్డు, ఐమ్యాక్స్ రోడ్డు, ఐమ్యాక్స్ ముందున్న హెచ్ఎండీఏ  స్థలంలో పార్క్ చేసుకోవచ్చు. ఇక, ఖైరతాబాద్ ప్రధాన రహదారి పై నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఆ మార్గంలోని పలు భవనాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

మెట్రో ప్రయాణికులు: మహాగణపతి సందర్శనార్థం మెట్రోలో వచ్చే భక్తులు ఐసీఐసీఐ బ్యాంకు వైపు నుంచి మాత్రమే కిందికి దిగాలి.
Lord Ganesha
Hyderabad
Khairatabad
Traffic

More Telugu News