సూర్యాపేట జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు!

10-09-2021 Fri 08:05
  • పది రోజుల క్రితమే నేరేడుచర్ల వచ్చిన యువతి
  • ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యువకుడు సైదులు
  • స్థానికులు సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయం
Man slit young girl throat in Suryapet dist

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు బ్లేడుతో యువతి గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన బాధిత యువతి (18) తల్లిదండ్రులు ఏడాది కాలంగా నేరేడుచర్లలో ఉంటున్నారు. యువతి తండ్రి ఆయుర్వేదం మందులు విక్రయిస్తుంటాడు. గుంటూరులో బంధువుల ఇంట్లో ఉంటున్న యువతి అప్పుడప్పుడు నేరేడుచర్ల వచ్చి వెళ్తుండేది.

ఈ క్రమంలో పది రోజుల క్రితం నేరేడుచర్ల వచ్చిన యువతిని చూసిన స్థానిక యువకుడు బాలసైదులు (23) ఆమె వెంటపడడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. మేనమామతో తనకు వివాహం నిశ్చయమైందని చెప్పినా అతడు వినిపించుకోలేదు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో మరో బాలికతో కలిసి దుస్తులు ఉతికేందుకు యువతి వెళ్లింది.

ఇది గమనించిన సైదులు అక్కడికి చేరుకుని బ్లేడుతో యువతి గొంతుకోసి పరారయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు యువతిని 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.