ముగిసిన ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్

10-09-2021 Fri 07:06
  • ఈ నెల 1న ఢిల్లీకి కేసీఆర్
  • తొలిసారి 9 రోజులపాటు ఢిల్లీలో సీఎం
  • హైదరాబాద్ చేరుకున్న వెంటనే 'నమస్తే తెలంగాణ' ఎండీ దామోదర్‌రావు ఇంటికి
  • తండ్రి మరణించడంతో కుటుంబ సభ్యులకు పరామర్శ
KCR Returns fro Delhi after 9 day visit

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన ఆయన 9 రోజులపాటు ఢిల్లీలో బిజీగా గడిపారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇంత సుదీర్ఘంగా ఉండడం ఇదే తొలిసారి. నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కేసీఆర్ సాయంత్రం హైదరాబాదుకు చేరుకున్నారు.

ఆ వెంటనే 'నమస్తే తెలంగాణ' పత్రిక ఎండీ దామోదర్‌రావు ఇంటికి వెళ్లారు. ఈ నెల 2న ఆయన తండ్రి నారాయణరావు మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన తల్లి ఆండాళమ్మను ఓదార్చారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

ఇక కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 2న దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయగా, 3న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. 4న అమిత్‌షా, 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలవాలని భావించినప్పటికీ ఆయన ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో అపాయింట్‌మెంట్ లభించలేదు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.