నారా లోకేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన వాసిరెడ్డి పద్మ

09-09-2021 Thu 21:41
  • నరసరావుపేటలో ఇటీవల అనూష హత్య
  • లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు
  • లోకేశ్ శవరాజకీయాలు చేస్తున్నాడన్న పద్మ
  • నరసరావుపేట రావాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం
Vasireddy Padma fires on Nara Lokesh

అనూష అనే అమ్మాయి గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొన్ని నెలల కిందట హత్యకు గురికాగా, ఆమె కుటుంబ సభ్యులను ఇవాళ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పరామర్శించేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరామర్శల పేరుతో లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆడపిల్లల చావులను విపక్ష టీడీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో ఘటన జరిగితే లోకేశ్ ఇప్పుడు నరసరావుపేట పర్యటనకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్ష నేతలుగా మీకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.  

దిశ చట్టాన్ని టీడీపీ హయాంలో ఎందుకు తీసుకురాలేదని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా, ఆ చట్టం స్ఫూర్తితో వారం రోజుల్లోనే చార్జిషీటు వేస్తున్నామని స్పష్టం చేశారు. అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని అన్నారు.