IT Returns: ఐటీ రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్రం

  • ఇప్పటికే ఒకసారి పొడిగింపు.. ఇది రెండోసారి
  • ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఇన్‌కంట్యాక్స్ విభాగం
  • గతేడాది కూడా నాలుగు సార్లు వాయిదా
Deadline for IT return filing extended to Dec 31

ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. సెప్టెంబరు 30లోపు ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ఈ గడువును డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఇన్‌కంట్యాక్స్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు సర్కులర్ నం.17/2021ను విడుదల చేసింది.

గతంలో జులై 31లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని చెప్పిన ప్రభుత్వం.. కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు రావడం, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ గడువును సెప్టెంబరు 30 వరకూ పొడిగించింది. ఇప్పుడు ఈ గడువును మరోసారి డిసెంబరు 31 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తమ ఖాతాలు ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు సాధారణంగా ఐటీఆర్-1 లేక ఐటీఆర్-4 ఫారాల ద్వారా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తారు. వీరికోసమే ఈ గడువును పొడిగించారు.

గతేడాది కూడా ప్రభుత్వం ఇలా ఐటీ రిటర్నుల దాఖలు గడువును నాలుగు సార్లు పొడిగించింది. తొలుత జులై 31లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని చెప్పిన ఆదాయపన్ను శాఖ.. ఈ తేదీని 2020 నవంబర్ 30 వరకూ పొడిగించింది. ఆ తర్వాత దాన్ని 2020 డిసెంబర్ 31కు పొడిగించి, ఆ తర్వాత మరోసారి 2021 జనవరి 10 వరకూ ఐటీ రిటర్నులు దాఖలు చేసే అవకాశం కల్పించింది.

More Telugu News