టీఆర్ఎస్ ఎంపీని అభినందించిన 'ఈనాడు' రామోజీరావు

09-09-2021 Thu 21:27
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ కు బీజం వేసిన సంతోష్
  • తాజాగా సీడ్ గణేశా విగ్రహాల రూపకల్పన
  • పలువురు ప్రముఖులకు పంపిన వైనం
  • విత్తన గణపతి ప్రతిమ అందుకున్న రామోజీరావు
Ramojirao appreciates TRS MP Santosh Kumar Seed Ganesha initiative

పర్యావరణ హితమే ప్రధాన అజెండాగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రారంభించి, అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళుతున్న టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన కార్యాచరణను మరింత విస్తరిస్తున్నారు. వినాయకచవితి నేపథ్యంలో సీడ్ గణేశా విగ్రహాలు రూపొందించారు. విత్తనాలు పొందుపరిచిన ఈ వినాయక ప్రతిమలను సంతోష్ కుమార్ అనేకమంది ప్రముఖులకు పంపిణీ చేశారు. ఈ ప్రతిమలు అందుకున్న వారిలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కూడా ఉన్నారు.

ఎంపీ సంతోష్ సామాజిక స్పృహ పట్ల రామోజీరావు ముగ్ధులయ్యారు. అభినందనలతో కూడిన లేఖను సంతోష్ కుమార్ కు పంపారు. మీరు పంపిన మట్టి గణపయ్య విగ్రహం ఎంతో ఆకట్టుకుందని, పర్యావరణం పట్ల మీకున్న చైతన్యానికి నిదర్శనంలా నిలిచిందని రామోజీరావు కొనియాడారు.

సంప్రదాయికమైన మన పండుగలను పర్యావరణ అనుకూల రీతుల్లోనూ జరుపుకోవచ్చన్న సందేశం ఇచ్చేలా మట్టి గణపయ్య విగ్రహాన్ని పంపినందుకు కృతజ్ఞతలు అంటూ రామోజీరావు తన లేఖలో స్పందించారు. గతంలోనూ ప్రాచీన భారతీయ సాహిత్యంలో ప్రస్తుతించిన అరుదైన వృక్షజాతుల చిత్రాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని వెలువరించారని గుర్తుచేశారు.