గర్భధారణను వాయిదా వేసుకోండి.. మహిళలకు శ్రీలంక సూచన

09-09-2021 Thu 20:12
  • ప్రకటన చేసిన లంక ఆరోగ్యశాఖ
  • ఇప్పటికే ఆహార ఎమర్జెన్సీ ప్రకటన
  • కరోనాతో మరణించిన 40 మంది గర్భిణులు
Srilanka asks women to delay pregnancy plans

ద్వీపదేశం శ్రీలంకలో కరోనా మూడో వేవ్ విజృంభిస్తోంది. ఇక్కడ డెల్టా వేరియంట్ కేసులతో ప్రజలు పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే దేశంలో ఆహార ఎమర్జెన్సీని ప్రకటించిన లంక ప్రభుత్వం.. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. పిల్లలు కావాలని ప్రయత్నాలు చేస్తున్న మహిళలు తమ ఆలోచనను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరింది.

కరోనా కారణంగా ఇప్పటి వరకూ 40 మంది గర్భిణులు మృత్యువాత పడిన నేపథ్యంలోనే ఈ సూచన చేస్తున్నట్లు లంక ప్రభుత్వ ఆరోగ్య ప్రచార బ్యూరో డైరెక్టర్ చిత్రమాలి డి. సిల్వ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ గైనకాలజిస్ట్ హర్ష ఆటపట్టు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సూచన చేసినట్లు ఆయన తెలిపారు.

సంతానాన్ని ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను కనీసం ఒక ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే శ్రీలంకలో 5,500 మంది గర్భిణులకు కరోనా వైరస్ సోకింది. వారిలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, అయినా వారికి కరోనా సోకిందని హర్ష పేర్కొన్నారు.