ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ నస్రత్ జహాన్... తండ్రెవరంటూ ప్రశ్నించిన మీడియాపై ఆగ్రహం

09-09-2021 Thu 19:42
  • ఆగస్టు 26న కుమారుడికి జన్మనిచ్చిన నస్రత్
  • తాజాగా ఓ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరు
  • ప్రశ్నల వర్షం కురిపించిన మీడియా
  • మహిళను కించపర్చడమేనన్న నస్రత్
Nusrat Jahan gets angry on media

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ ఆగస్టు 26న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కుమారుడికి ఇషాన్ అని నామకరణం చేశారు. కొడుకు పుట్టినప్పటి నుంచి తన నివాసానికే పరిమితమైన ఆమె తాజాగా కోల్ కతాలోని ఓ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా.. బిడ్డకు తండ్రి ఎవరన్న అంశంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో తీవ్రంగా స్పందించారు.

ఓ మహిళ వ్యక్తిగత జీవితాన్ని ఎత్తిచూపేలా ఇలాంటి పరోక్ష ప్రశ్నలు అడగడం దారుణమని పేర్కొన్నారు. బిడ్డకు తండ్రెవరు? అంటూ అడగడం మహిళ వ్యక్తిత్వాన్ని కించపర్చడమేనని అన్నారు. 'నా బిడ్డకు తండ్రెవరన్నది ఆ తండ్రికి తెలుసు' అంటూ వ్యాఖ్యానించారు. 'ప్రస్తుతానికి నేను, యష్ సంతోషంగానే ఉన్నాం' అని తెలిపారు.

గతంలో నస్రత్ జహాన్ టర్కీ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను పెళ్లాడారు. టర్కీ చట్టాల ప్రకారం వారి వివాహం జరిగింది. కొన్ని నెలల కిందట వీరి దాంపత్య బంధం విచ్ఛిన్నమైంది. అయితే, నస్రత్ దీనిపై వ్యాఖ్యానిస్తూ, భారతీయ చట్టాల ప్రకారం తమ పెళ్లి చెల్లదని, తమది సహజీవనంగానే పరిగణిస్తారని పేర్కొంది. ఇటీవల నస్రత్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నిఖిల్ జైన్ శుభాకాంక్షలు తెలియజేశారు.